తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే.. కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: సీఎం
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, విద్య, క్రీడలు, పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తమ విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమర్పించామని సీఎం వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం వెనుక కారణాలను కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతోనే పర్యటనను తిరస్కరించినట్లు కేంద్రం తెలిపిందని, ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా పెట్టుబడుల కోసం తాను అమెరికా వెళ్లాలనుకుంటే అడ్డుకోవడం రాజకీయ వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. “ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగత అవమానం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం” అని పేర్కొన్నారు.విదేశీ విద్య, క్రీడలు, పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడమే తమ పర్యటన లక్ష్యమని తెలిపారు. అమెరికాలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ భారత రాయబార కార్యాలయ పర్యవేక్షణలోనే ఉండేవని, ఇందులో ఎలాంటి రహస్య వ్యవహారం లేదని స్పష్టం చేశారు.కేంద్రం వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉందని సీఎం అన్నారు. తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే తమ ఆందోళన అని తెలిపారు. ఈ అంశాన్ని తమ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావిస్తారని వెల్లడించారు.తన విదేశీ పర్యటనను అడ్డుకోవచ్చని, కానీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని అడ్డుకోలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహించి విద్య, క్రీడలు, పెట్టుబడుల రంగాల్లో భారీ అవకాశాలను ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply