విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది: బట్టి విక్రమార్క.

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పీక్ పవర్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిందని, తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్ అని పేర్కొన్నారు. దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు.
కర్ణాటకలో పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లలోపే ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉందని భట్టి వివరించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తున్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
విద్యుత్ రంగంపై కొందరు నేతలు తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని భట్టి విమర్శించారు. వాస్తవాలు, డాక్యుమెంటరీ ఆధారాలతో స్పష్టత ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. డిస్కామ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, విద్యుత్ సంస్థలను లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ప్రతిపాదన కూడా లేదని స్పష్టం చేశారు. బలమైన పబ్లిక్ సెక్టార్ సంస్థలను కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌పై కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని భట్టి అన్నారు. 2015 ఫిబ్రవరి 16న ప్లాంట్‌కు LOI ఇచ్చారని, థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా, కోల్ లింకేజీ అత్యంత కీలకమని తెలిపారు. సింగరేణి నుంచి G9 గ్రేడ్ బొగ్గు సరఫరా చేస్తామని 2016లో హామీ ఇచ్చిన తర్వాతే ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు పడిందన్నారు. అయితే ఒప్పందం చేసుకునే నాటికి సింగరేణి వద్ద G9 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయా అనే అంశంపై స్పష్టత అవసరమన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ వ్యవహారంపై పూర్తి వివరాలను డాక్యుమెంటరీ ఆధారాలతో ప్రజల ముందుంచుతామని భట్టి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని, బాధ్యతగల ప్రతిపక్ష నేతలు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.